అభివృద్ధి పథకం

పల్లె ప్రగతి స్ఫూర్తితో రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రూపకల్పన చేసిన పట్టణ ప్రగతి కార్యక్రమం సోమవారం జిల్లాలోని రామగుండం కార్పొరేషన్‌ సహా అన్ని మున్సిపాలిటీల్లో ప్రారంభమైంది. పట్టణాల్లో పేరుకుపోయిన సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన కమిటీల సభ్యులతో కలిసి అధికారులు, ప్రజా ప్రతినిధులు పాద యాత్రలు నిర్వహించారు. పెద్దపల్లి మున్సిపాల్టీ 19వ వార్డు పరిధిలోని బండారికుంటలో కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ మొక్కను నాటి, పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రతి వార్డులో పాదయాత్రలు చేపట్టి, ప్రజా సమస్యలను గుర్తించాలని కలెక్టర్‌ సూచించారు. పెద్దపల్లిలోని 7వ వార్డులో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ చిట్టిరెడ్డి మమతా రెడ్డి శ్రీకారం చుట్టారు. నూతనంగా రోడ్డు పనులను, విద్యుత్‌ స్తంభాల ఏర్పాటును ప్రారంభించారు. మంథని మున్సిపాల్టీ పరిధిలోని 2వ వార్డులో కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌, జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌తో కలిసి ‘పట్టణ ప్రగతి’ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యుత్‌ స్తంభాల ఏర్పాటు పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. మంథనిలో చేపట్టాల్సిన పనుల గురించి కలెక్టర్‌, జడ్పీ చైర్మన్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పుట్ట శైలజ, వైస్‌ చైర్మన్‌ ఆరెపల్లి కుమార్‌ ప్రజలతో చర్చించారు.